Physiotherapy Post-Inter: ఇంట‌ర్ త‌ర్వాత స‌త్వ‌ర ఉపాధికి ఫిజియో థెర‌పీ! 11 month ago

featured-image

మందులతోనే అన్ని జబ్బులూ నయం కావు. కొన్ని రోగాల‌కు ఔషధాలతోపాటు థెరపీ తప్పనిసరి. వివిధ రకాల నొప్పుల‌తో ఇబ్బంది ప‌డేవారు, వివిధ సమస్యలతో సతమతమయ్యేవారు త్వరగా ఉపశమనానికి ఫిజియోథెరపీని ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో ఆసక్తి క‌లిగిన వారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సుతో సులువుగానే ఉపాధి పొందగలరు. రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్ధాయిలో కూడా పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఈ కోర్సును చదువుకోవచ్చు.


ప్రతి 10వేల మందికీ ఒక ఫిజియోథెరపిస్టు ఉండాలి. కానీ మన దేశంలో అంతమంది లేరు. వీరి ప్ర‌ధాన క‌ర్త‌వ్యం ఏమంటే వృత్తి నేపథ్యం కారణంగా వస్తోన్న నొప్పులు, ఆటలు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాలు, పుట్టుకతో వచ్చే వైకల్యం, జీవనశైలి కార‌ణంగా వ‌చ్చే సమస్యలు వీటి నుంచి వీలైనంతగా ఉపశమనం కలిగించడమే ఫిజియోథెరపిస్టుల కర్తవ్యం. పదో తరగతి తర్వాత ఈ కోర్సుని ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యలో భాగంగా కూడా పూర్తిచేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్‌ ఫిజియోథెరపీ (డీపీటీ)నీ కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) చేస్తే ఫిజియోథెరపిస్టుగా బాగా రాణించగలరు. ఇంట‌ర్ ఒకేషనల్‌ కోర్సుల అనంతరం బయాలజీ బ్రిడ్జి కోర్సు పూర్తిచేసుకున్నవాళ్లు, ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. ఆ తర్వాత ఆసక్తిని బ‌ట్టి నచ్చిన స్పెషలైజేషన్‌తో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) పూర్తిచేసుకోవచ్చు. త‌ద‌నంత‌రం కూడా పీహెచ్‌డీకీ అవకాశం ఉంటుంది.


ఫిజియోథెరపిస్టుగా సేవలు అందించాలని ఆశించేవారు

బీపీటీ బోధ‌న అంతా ఆంగ్ల మాధ్య‌మంలోనే ఉంటుంది. బీపీటీ వ్యవధి నాలుగేళ్లు. మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. ఈ కోర్సులో భాగంగా మానవ శరీర నిర్మాణ‌ము, వివిధ అవయవాల పనితీరుని తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, మెడికల్, సర్జికల్‌ కండిషన్లు, బయోమెకానిక్స్, కైనిసియాలజీ, డిజేబిలిటీ ప్రివెన్షన్, రిహాబిలిటేషన్‌ వీటిని నేర్చుకుంటారు. ఈ కోర్సులో థియరీకి ఎంత పాధాన్య‌త ఉందో, ప్రాక్టికల్స్ కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఈ విభాగంలో రాణించాలంటే ముఖ్యంగా నాడీ వ్యవస్థ పైన, శరీరంలో అంతర్గతంగా ఉన్న ఎముకలు, కండరాల పైన‌ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.


ఏయే నైపుణ్యాలు

బీపీటీలో చేరే విద్యార్దుల‌కు శారీరక దృఢత్వం ఉంటే మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు గంటలపాటు, పలు పద్ధతుల్లో, విడతలవారీగా వ్యాయామాలు (థెరపీ) చేయించాలి. ఇందుకోసం ఓపిక, శక్తి అవసరం. వైద్యులతో అనుసంధానమై, వాళ్ల సూచనల‌ను పరిగణనలోకి తీసుకుని, అవసరాలకు తగ్గ సేవలు అందించాలి. నొప్పి కారణం చేత‌ రోగులు ఫిజియోథెరపీని తిరస్కరించొచ్చు. మధ్యలోనే ఆపేయమనొచ్చు. దీని ప్రాధాన్యాన్ని చెప్పి, ఒప్పించగలిగే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. మాటల చేత‌నూ మానసిక సాంత్వన కలిగేలా చూడాలి. ఈ వృత్తిలో పేరు రావడానికి సమయం పడుతుంది కాబ‌ట్టి సహనం, సేవాభావం ఉంటేనే రాణించగలరు.


మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఉన్న‌త విద్య‌)

బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజియోథెర‌పీ అనంత‌రం ఆస‌క్తి ఉంటే మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) చదువుకోవచ్చు. ఎంపీటీ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఈ కోర్సులో కార్డియో వాస్కుల‌ర్ అండ్ ప‌ల్మ‌న‌రీ సైన్స్‌, మ‌స్కులోస్కెలిట‌ల్ సైన్స్‌, న్యూరో సైన్స్‌, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, జెరియాట్రిక్స్, కమ్యూనిటీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్‌ ఫిజియోథెరపీ స్పెషలైజేషన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. ఈ కోర్సులు చ‌దివినవారు సంబంధిత విభాగాల్లో స్పెషలిస్టుగా రాణిస్తారు. ఎంపీటీ అనంతరం బోధనలో ఆసక్తి ఉంటే పీహెచ్‌డీలో కూడా చేరవచ్చు. మేటి అవకాశాలకు పీజీ, బోధనలో పీహెచ్‌డీ ఉపయోగపడతాయి.


అర్హ‌త‌లు

ఇంటర్ లో వొకేషనల్‌ (ఫిజియోథెరపీ) లేదా బైపీసీ లేదా ఇంటర్‌ వొకేషనల్‌తో పాటు బయాలజీ, ఫిజికల్‌ సైన్సుల్లో బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ఏపీ/ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరే స‌మ‌యానికి 17 ఏళ్ల వ‌య‌సు పూర్తయి ఉండాలి.


ఈ కోర్సుల‌తో కెరియ‌ర్ అవ‌కాశాలు

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో బీపీటీతో ఎక్కువ కొలువులు దక్కుతాయి. ఆర్థో, న్యూరాలజీ, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. పునరావాస, నొప్పి నివారణ కేంద్రాలు, ప్రత్యేక పాఠశాలలు, ఉమెన్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, పాలీ క్లినిక్‌లు, ఓల్డేజ్‌ హోంలు, దివ్యాంగులకు సేవలందించే కేంద్రాలు, పరిశ్రమలు, హోం కేరింగ్, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్‌ హోమ్‌లు, ప్రైవేటు కేర్‌ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడ‌మీలు, కార్పొరేట్ సంస్ధ‌లు, ఫిట్‌నెస్ సెంట‌ర్ల‌లో ఎంపీటీ విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు పొంద‌వ‌చ్చు.

ప్రారంభంలో తక్కువ వేతనంతోనే మొద‌ల‌వుతుంది. దీనిలో మంచి అనుభ‌వం, నైపుణ్యాలు ఉంటే ఆక‌ర్ష‌ణీయ ప్రోత్సాహ‌కాలు అందుతాయి.


సొంతగానూ రాణించవ‌చ్చు.....

సేవలందిస్తోన్న ప్రాంతాన్ని బ‌ట్టి, థెరపీ విధానానికి త‌గ్గ‌ట్టు ఒక్కో సిట్టింగ్‌కూ రూ.200 నుంచీ రూ.500, ఆపైనా పొందవచ్చు. ఫిజియోథెరపీ సేవలకోసమే ప్రత్యేక సంస్థలూ కూడా వెలిశాయి. కొత్త‌గా కోర్సు పూర్తి చేసుకున్న అభ్య‌ర్ధులు నగరాలు, పట్టణాల్లో వీటిద్వారా ఉపాధి పొందవచ్చు. విషయ పరిజ్ఞానం, ఆంగ్లంలో నైపుణ్యం ఉన్న ఫిజియోలకు విదేశాల్లో కూడా ఆకర్షణీయ వేతనాల‌ను కైవ‌సం చేసుకోవ‌చ్చు. యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియా, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌ల్లో వీరికి బాగా మెండుగా ఉన్నాయి. వీరిని అమెరికాలో ఫిజిక‌ల్ థెర‌పిస్టులుగా పిలుస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో... 

ఏపీ, తెలంగాణాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియో థెరపీ (బీపీటీ) కోర్సు ను అందిస్తున్నాయి. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఆంధ్రా యూనివ‌ర్సిటీ, శ్రీవెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ ప‌రిధిలో 40 కి పైగా క‌ళాశాల‌ల్లో బీపీటీ కోర్సును అందిస్తున్నాయి. తెలంగాణ‌లో సుమారు 25 సంస్ధ‌ల‌లో బీపీటీ కోర్సుని చ‌దువుకోవ‌చ్చు.

తెలంగాణ‌లో కాళోజీ నారాయ‌ణ‌రావు యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌, ఆంధ్రాలో డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ ల ఆధ్వ‌ర్యంలో ఇవి న‌డుస్తున్నాయి.


విద్య ఉచితం....ఉద్యోగం ఉన్న‌తం

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD